తుమ్మి

తుమ్మి (తుంబి)

ఇంగ్లీషుపేరు: తుంబై

శాస్త్రీయ నామం: లూకాస్ ఏస్పరా

కుటుంబం: లామిఏసియే

ఈ మొక్క లు ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో, తేలికపాటి నేలలో పెరిగే ఏకవార్షిక కలుపు మొక్క. సుమారు 15-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలుగా ఉండి, నూగును కలిగి ఉంటుంది. సన్నని అండాకారం కలిగిన పత్రాలు కణుపుకు ఇరువైపులా ఉంటాయి. పత్రాలు వ్యాక్స్ (నూనె వంటి పదార్థం)ను కలిగి ఉంటాయి. పత్రాలపై స్పష్టమైన చారలు ఉంటాయి. పుష్పాలు తెలుపు రంగుతో ఉండి శాఖల చివర గుత్తులుగా వస్తాయి. పుష్పవృతం ఉండదు. పుష్ప గుచ్ఛాలు ముండ్ల వంటి కొనలను కలిగి ఉంటాయి. ఫలాలు 2.5 మిల్లీ మీటర్ల పొడవుండి, బూడిదరంగు విత్తనాలను కలిగి ఉంటాయి. ఈ మొక్కను ఆదివాసీయులు వైద్యపరంగా అనేక వ్యాధుల నిర్మూలనలో ఉపయోగిస్తారు.  

రసాయన పదార్థాలు:

ఈ మొక్కలో బీటా-సైటోస్టిరాల్, నికోటెన్, గ్లూకోసైడ్స్, ఫ్లావనాయిడ్స్, టెర్పైన్స్, యుర్ సోలిక్ ఆమ్లము వంటి అనేక ముఖ్యమైన రసాయన పదార్థాలు వుంటాయి. (డా|| శ్రీనివాసన్ – 2011)

వైద్య పరంగా ఉపయోగాలు:

ఈ మొక్కను దగ్గు, ఆస్త్మా, తలనొప్పి, చర్మ వ్యాధుల నివారణలో చాలా కాలంగా ఆదివాసీయులు ఉపయోగిస్తున్నారు. అదే విధంగా ఈ మొక్కను తేలు కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయంలో ఉపయోగాలు:

తుమ్మి మొక్కలో ఉన్న రసాయనాలు చాలా శక్తివంత మైనవి. ఈ రసాయనాలు కీటకాలకు అభివృద్ధి నిరోధకంగానూ మరియు కీటకనాశనిగానూ పని చేస్తాయని డా|| శర్మ (2009) మరియు డా|| జూలియర్ (2013) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

ఈ మొక్క యొక్క కషాయానికి పంటలను ఆశించే పిండి పురుగు, రసం పీల్చే పురుగులను నివారించే గుణం ఉండని డా|| ముఖర్జీ (2009) పరిశోధనలలో తేలింది.  

తుమ్మి మొక్క కషాయానికి దోమలను నివారించే లక్షణాలు ఉన్నాయని డా|| జూలియర్ (2013) పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ మొక్కలను సేకరించి, బాగా ఎండబెట్టి, ధూపంగా వేసి దోమల నివారణలో ఉపయోగించడం ఈ రచయిత గమనించడం జరిగింది. ఈ మొక్క కీటక నాశని లక్షణాలపై శాస్త్రజ్ఞుల పరిశోధనలు ఎంతో అవసరముంది. ఈ మొక్కను రైతులు పురుగుల నివారణకోసం పంచపత్ర కషాయంలో ఉపయోగించుకోవచ్చు.

సేంద్రియ వ్యవసాయంలో ఈ మొక్కను ‘సస్యరక్షణ’ కొరకు రైతులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *