పశువుల పేడ, మూత్రం ద్రావణం – సుస్థిర వ్యవసాయ కేంద్రం

పశువుల పేడ, మూత్రం ద్రావణం మొక్కలకు తక్షణ శక్తి ఇస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో తెగుళ్లు / పురుగుల సమస్య నుంచి తేరుకుంటున్నప్పుడు దీనిని వాడుకోవచ్చు. పశువుల పేడ, పశువుల మూత్రంలో చాలా రకాల పంటలకు ఉపయోగపడే  సూక్ష్మజీవులున్నాయి. ఇవి పంటకు హానిచేసే తెగుళ్ళను నివారించడంలో ఉపయోగ పడతాయి. ఈ ద్రావణంలో ఉన్న పోషకాల (నత్రజని, భాస్వరం, పొటాష్‌ మరియు సూక్ష్మ పోషకాలు) వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఈ ద్రావణాన్ని పంటకాలంలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.

 కావలసిన పదార్థాలు:

 పశువుల పేడ    5 కిలోలు

 పశువుల మూత్రం       5 లీటర్లు

 సున్నం  150 గ్రా||

 తయారు చేసే విధానం: 

  • 5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రం తీసుకుని, 5 లీటర్ల నీటిని కలిపి ఒక తొట్టిలో నిలువ చేయాలి.
  • తొట్టిపై మూత పెట్టి, 4 రోజులపాటు ఆ మిశ్రమాన్ని మురగబెట్టాలి.
  • పై మిశ్రమాన్ని ప్రతిరోజు కర్రతో, సవ్య మరియు అపసవ్య దిశలలో బాగా కలియపెట్టాలి.
  • ఈ మిశ్రమానికి 4 రోజుల తర్వాత కొద్దిగా నీరు చేర్చి, వడపోసి, 150 గ్రాముల సున్నం కలపాలి.
  • ఈ ద్రావణానికి 100 లీటర్ల నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో ఒక సారి పిచికారీ చేయాలి.

 జాగ్రత్తలు:

  •  పశువుల పేడ, మూత్రం ద్రావణం చిక్కగా ఉంటుంది. అందువల్ల వడపోయటానికి మొదట ఒక మెష్‌నుగానీ, పలుచటి గోనెసంచిని గానీ ఉపయోగించాలి.
  •  తర్వాత దానికి నీరు కలిపి పలుచటిగుడ్డతో వడపోసుకోవాలి.
  •  తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి.
  •  ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ద్రావణం చెడిపోయే అవకాశం ఉంది.
  •  పంటలలో తెగుళ్ళ సమస్య వుంటే పశువుల పేడ, మూత్రం ద్రావణానికి ఇంగువ కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఉపయోగాలు:

  • ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే దాని ఘాటైన వాసనకు రెక్కల పురుగులు పంటపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు.
  • ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారీ చేయటం వల్ల పంటలు బెట్టను సుమారు వారం రోజులవరకూ తట్టుకుంటాయి.(రైతుల అనుభవం)
  • ఈ ద్రావణం పంటలలో వ్యాధినిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
  • ఈ ద్రావణాన్ని బాగా వడపోసి ”డ్రిప్‌” లేదా ”స్ప్రింక్లర్‌” పద్దతి ద్వారా పంటలకు అందజేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *